*స్వప్న కథ*

ప్లాష్...ప్లాష్....
*మోడల్ స్కూళ్ళు పాఠశాల విద్యలో విలీనం.* *తొలగనున్న  జీతాలకష్టాలు*
*010 హెడ్ ద్వారా జీతాల చెల్లింపుకు ముఖ్యమంత్రి అంగీకారం*
*వెంటనే హెల్త్ కార్డుల ఉత్తర్వులివ్వమని అధికారులకాదేశం*
*ఉపాధ్యాయ వర్గంలో మిన్నంటిన సంబరాలు.*
ఎట్టకేలకు మోడల్ స్కూల్ బాలారిష్టాలు తీరనున్నాయి. ముఖ్యమంత్రి చొరవతో చిరకాలం పెండింగ్ లో ఉన్న సమస్యలు తొలిగిపోయాయి...ఈనాడు
 యాహూ.... యాహూ..... నా కష్టాలు పోయాయోచ్. యా...హూ...
ఏవండోయ్ మాస్టారు లేవండి నిద్దట్లో ఏంటా పలవరింతలు. మీ అరుపులకి పిల్లలు నిద్రలే స్తారు.అంటూ భార్య పిలుపుతో  మెలకువ వచ్చింది సుందరం మాస్టారికి. వచ్చింది కలా.. నిజమైతే ఎంత బాగుండు. యథాలపంగా బయటకు అనేసాడు సందరం మాస్టారు.
ఏంకలొచ్చిందండి. నాక్కూడా కొంచెం చెబ్దురూ.. గోముగా అడిగింది భార్య. చాలా అందమైన కల ముఖ్యమంత్రి తియ్యని మాటలు , ఉపాధ్యాయుల ముఖాల్లో చిరునవ్వు..ఆహా.. అంటూ తన్మయంగా చెప్పటం ప్రారంభించాడు మాస్టారు. ముగించేసరికి తెల్లవారింది.
ఏదో కొత్త ఉత్సాహం ఆవరించటంతో ఇక నిద్రపట్టక లేచినోట్లో పందెంపుల్ల వేసుకొని అటు ఇటు తిరుగుతూ న్యూస్ పేపర్ కోసం ఎదురుచూడసాగాడు.
ఇంతలో పేపర్ బోయ్  పేపర్...  అని అరుచుకుంటూ పేపర్ ని విసిరుతూ వెళ్ళిపోయాడు. ఒక్క అంగలో వెళ్ళి పేపర్నందుకున్నాడు. తానెరుచూసిన విషయం కోసం పేపరంతా గాలించాడు. దొరక్కపోవటంతో వేటకెళ్ళిన బెస్తవాడు చేపలుపడక దిగాలుగా ముఖంవేలాడేసుకు  వచ్చినట్లు  ఇంట్లోకి వచ్చాడు.
'నాన్నకు గుర్తుచేయలేదా' అంటూ తల్లితో ఏదో మాట్లాడుతుంది ఆరేళ్ళ పండు.
ఏంటమ్మా అంటూ దగ్గరకు వెళ్ళాడు సుందరం మాస్టారు.
వచ్చేవారం దాని పుట్టినరోజుకు కొత్తబట్టలు చాక్లేట్లు బిస్కెట్లు కావాలంట మీకు గుర్తు చేయమని నన్నడుగుతుంది మీ ముద్దులకూతురు అని చేతులుతిప్పుతూ చెప్పింది భార్య.
నా బంగారు తల్లి పుట్టిన రోజును
నేనసలు మర్చిపోతేకద! అన్నీ కొని పెడతా అని పండుని దగ్గరకు తీసుకొని ముద్దాడాడు.
                  *  *   *   *   *  *
హలో సార్ గుడ్ మార్నింగ్ జీతాలెప్పుడు వస్తాయంట. తన కొలీగ్ రామారావునడిగాడు సుందరం మాస్టారు.
రామారావు నిజాయితీ గల యూనియన్ నాయకుడు. జీతాలకోసం ఉపాధ్యాయుల సమస్యలకోసం నిరంతరం పోరాడుతున్నవాడు.
'ఏం తేల్లేదు సార్' మళ్ళీ ఉద్యమం చేయాలని యూనియన్ నాయకులంటున్నారు అన్నాడు రామారావు.
ఈ మాట వినగానే నిర్విణ్ణుడయ్యి 'అలాగా' అన్నాడు సందరం మాస్టారు.
సాయంత్రం వరకు పిల్లలకు పాఠాలు చెప్పడంలో పడి లోకాన్ని మరచిపోయాడు.
హోల్ బెల్ మోగడంతో క్యారేజి తీసుకోవడానికి స్టాఫ్ రూమ్ లోకి వచ్చి రామారావును చూడగానే పండు మనసులో మెదిలింది. అడుగుదామా వద్దా అనుకుంటూ తనలోతనే మథనపడసాగాడు,
ఏంటిమాస్టారు అదోలా ఉన్నారు అన్న రామారావు పిలుపుతో లోకంలోకొచ్చాడు సందరం మాస్టారు.
చేయి చాచి అడగడానికి ఆత్మాభిమానమడ్డొచ్చి, ఏంలేదంటూ ఇంటికిబయలుదేరాడు.
ఎప్పుడూ పలకరిస్తూ వెళ్ళే మాస్టారు ఈ రోజు ముభావంగా వెళ్ళడం చూసి ఏంటి మాస్టారు ఏంటి సంగతులు అంటూ తనే పలకరించాడు పెద్దంగడి వెంకన్న సెట్టి.
ఏంలేదండి సెట్టిగారు ఏదో ఆలోచనలో పడి వెళ్ళి పోతున్నాను అంతే అంటూ నిండుకుండలా ఇంటికి చేరుకున్నాడు.
రాత్రికి ఏదో తిన్నాననిపిచి లేచిపోయాడు. పండుతో ఆడుకొని, కథలు చెప్పి నిద్రకుపక్రమిచాడు కానీ నిద్రపట్టక అటూఇటూ మెదులుతూనే ఉన్నాడు. చివరకే రెండింటికో నిద్రపట్టింది.....
                *    *    *     *    *
బ్లడ్ టెస్ట్ రిపోర్టుచూసి, వద్దు..వద్దు... అని పండు మారాం చేస్తున్నా బలవంతంగా సూది వేసి పాపను వెంటనే హాస్పటల్లో చేర్చమని లేదంటే చాలా ప్రమాదమని మాస్టార్ని హెచ్చరించాడు డాక్టర్. హాస్పటల్లో ప్రభుత్వం ఇచ్చే ఆరోగ్యశ్రీ పథకముందని తెచ్చుకుంటే వైద్యం ఉచితమని మాస్టారి ముఖకవళికలను బట్టి సలహా ఇచ్చిందో నర్సు.
తాను ప్రభుత్వ ఉపాధ్యాయుడనని చెప్పడంతో హెల్త్ కార్డు పనిచేస్తుందని ఆలస్యం చేయకుండా తెచ్చుకోమని అసహనంగా అనటంతో మారుమాట్లాడకుండా ఇంటికి వెళ్ళాడు. తన భార్యకు ఎంతో ఇష్టపడి చేయించిన ముత్యాలగాజును వెంకన్న సెట్టి దగ్గర కుదువకుంచి ఇరవైవేలు పుచ్చుకొని వైద్యం చేయించడానికి హాస్పటల్కి పరుగెత్తాడు. మాస్టారికి పండు అంటే ప్రాణం, తన కళ్ళముందు కేరింతలు కొట్టే పాప ఇలా బెడ్ మీద గువ్వలా పడుండటం తట్టుకోలేకపోతున్నాడు. అతని తండ్రి హృదయం  ఆ పిల్లని రక్షించుకోవాలని తపించి పోతుంది. అమ్మా.. పండు లేమ్మా.. నీ కోసం చాక్లేట్లూ, బిస్కెట్లు తెచ్చాను చూడమ్మా.. కొత్త బట్టలు కొనుక్కుందాం లేమ్మా..అంటూ దీనంగా లేపసాగాడు.
                   *    *      *       *        *
సుందరం మాస్టారి పలవరింతలకు లేచి నాన్న ...నాన్న... లే నాన్న  వెళదాం పద అంటూ పండు మాస్టారి చేతిని పట్టుకొని కుదపసాగింది.
దిగ్గున లేచి ఎదురుగా పండును చూసి హమ్మయ్య ఇది కలా అనుకొని నిట్టూర్పు విడిచి, రేపు ఉదయమే లేచి కొనుక్కుందాం పడుకోమ్మా అంటూ నిద్రపుచ్చాడు.
తెల్లవారటంతోనే మాష్టారు భార్యతో చెప్పి బీరువాలోని బంగారు గాజు తీసుకొని తిన్నగా వెంకన్న సెట్టి దగ్గరకు వెళ్ళాడు.
గాజతనిముందుంచాడు మౌనంగా..
'అయో! మాస్టారు డబ్బు కోసం మీరు కుదువ పెట్టాలాండి.' ఉంచండి మాస్టారు ఎంతకావాలో పట్టుకుపోండి. మీదగ్గరున్నప్పుడు ఇద్దురుగానీ అన్నాడు సెట్టి.
అలా వద్దులేండి అందరికీ ఇచ్చినట్లు కుదువపెట్టుకొని ఇవ్వండి. జీతాలు అందిన వెంటనే మీ బాకీ తీర్చుకుంటాను అన్నాడు మాస్టారు.
పరవాలేదులే మాస్టారు తీసుకువెళ్ళండి, మీ దగ్గరుంటే బ్యాంకులో ఉన్నట్లే. నా కానమ్మకముంది. ఏదైనా అవసరముంటే రండి అన్న సెట్టి మాట కాదనలేక
మీ నమ్మకానికి థాంక్సండి అని నిష్క్రమించాడు.
                 *     *        *         *      *
పండు జన్మదినోత్సవానికి  భార్యాభర్తలు ఇంటిని అందంగా తీర్చిదిద్దారు.పండు తరగతి పిల్లలూ, ఆమె స్నేహితులతో పాటు చుట్టాలు బంధువులు కూడా వచ్చారు. పుట్టినరోజుకు కొన్న గౌనులో పండును చూసి మాష్టారి కళ్ళు చమర్చాయి.
అప్పుడే లోపలికి వచ్చిన రామారావు గారు సుందరం మాస్టారి వద్దకు వెళ్ళి 'మాస్టారు మన యూనియన్ ఉద్యమాన్ని ఉదృతం చేస్తుంది. ప్రభుత్వం చర్చలకు పిలిచే అవకాశముంది.  అదే జరిగితే మన కష్టాలు చాలా వరకు పరిష్కారం కావచ్చు. అని తెలియచేసాడు. ఉద్యమంలో నన్ను కూడా చేర్చుకోండి రామారావు గారు అని అడిగిన మాస్టారుతో మీవంటి ఉత్తములకెప్పుడూ స్వాగతద్వారాలు తెరిచే ఉంటాయని సంఘేశక్తిః కలౌయుగే అనే సూక్తిని నిజం చేద్దామని మన కలలను సాకారం చేసుకుందామని రామారావు  చెప్పడంతో  ఆ మాటలు సుందరం మాస్టారికి స్పూర్తిని, కొంత ఉపశమనాన్ని కలిగించాయి. మనిషి ఆశాజీవికదా.
*    *     *      *      *
విజయవాడ 24.7.17 విద్యాశాఖ కమీషనరేట్ ముందు. వర్థిల్లాలి ఉపాధ్యాయుల ఐక్యత.... వర్థిల్లాలి. పరిష్కరించాలి ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే.... పరిష్కరిచాలి అంటూ నినాదాలు మిన్నంటుతున్నాయి.
వేల సంఖ్యలో వచ్చిన ఉపాధ్యాయులను చూడగానే సుందరం మాస్టారిలో కొత్త ఉత్సాహం మొదలయింది.
సమస్య తనొక్కడిదే కాదని ఒక వ్యవస్థదని అర్థమయింది. ఉపాధ్యాయుల ఐక్యతను చూసి మాస్టారి ఒళ్ళు పులకాంకురమయింది. ఈ సమస్యల్నే కాదు దేన్నయినా సాధించగలమనే కొండంత ఆత్మవిశ్వాసం మాస్టారి గుండెల్లో ప్రోదిచేసుకుంది.
ననేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం
విశ్వవృష్టికి
అశ్రువొక్కటి ధారపోశాను!
నేను సైతం
భువనఘోషకు
వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!
* * *
ఎండకాలం మండినప్పుడు
గబ్బిలం వలె
క్రాగిపోలేదా!
వానకాలం ముసిరి రాగా
నిలువు నిలువున
నీరు కాలేదా?
శీతకాలం కోత పెట్టగ
కొరడు కట్టీ,
ఆకలేసీ కేకలేశానే!
* * *
నే నొక్కణ్ణీ
నిల్చిపోతే-
చండ్రగాడ్పులు, వానమబ్బులు, మంచుసోనలు
భూమి మీదా
భుగ్నమవుతాయి!
నింగినుండీ తొంగిచూసే
రంగు రంగుల చుక్కలన్నీ
రాలి, నెత్తురు కక్కుకుంటూ
పేలిపోతాయి!
పగళ్లన్నీ పగిలిపోయీ,
నిశీథాలూ విశీర్ణిల్లీ,
మహాప్రళయం జగం నిండా
ప్రగల్భిస్తుంది!
* * *
నే నొకణ్ణి ధాత్రినిండా
నిండిపోయీ-
నా కుహూరుత శీకరాలే
లోకమంతా జల్లులాడే
ఆ ముహూర్తాలాగమిస్తాయి!
* * *
నేను సైతం
ప్రపంచాబ్జపు
తెల్లరేకై పల్లవిస్తాను!
నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై మూర్ఛనలు పోతాను!
నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను!
అనే శ్రీశ్రీ కవిత స్పూర్తితో ఉద్యమకాంతుల ఎర్రబావుటాను పైకిలేపాడు.
*     *      *      *       *
సుందరం మాస్టారు మీకో శుభవార్త ప్రభుత్వం యూనియన్ నాయకులను చర్చలకు పిలిచింది. మన డిమాండ్లను తీర్చడానికి, నెలనెలా 010 ద్వారా జీతాలివ్వడానికి అంగీకరించింది అని చెప్పాడు.
మరుసటి రోజు ఉదయం పేపర్లో మొదటి పేజిలో వార్తను చూసి మాస్టారి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. రామారావుకు ఉపాధ్యాయసంఘానికి మనస్సులోనే ధన్యవాదాలు తెలిపి, నాన్నా అంటూ వచ్చిన పండును గుండెలకు హత్తుకొన్నాడు. మాష్టారి కళ్ళలో ఆనందభాష్పాలు గిర్రున తిరిగాయి.

🙏మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల పోరాటానికంకితం🙏

రచన: శిఖాకొల్లి బాలాజీ

Comments

Popular posts from this blog