ప్రస్థానం (ఆదర్శ బాలుని ఆత్మకథ'వ్యథ')
నేను ఆరవ తరగతి చదువు తున్నాను. ఇక్కడ ఇంగ్లీషు మీడియం ఉందని మా ఊళ్ళో బడి
ఉన్నా నన్ను ఇక్కడ చేర్చాడు మా నాన్న. సూర్యునితో పాటు నేనూ బయలు దేరతాను. స్కూలుకు రావాలంటే రెండు బస్సులు మారాలి. పొరపాటున ఒకబస్సు అందుకోలేకపోతే ఆ రోజు సెలవే. సైకిలేసుకు రావడానికా అంతదూరం నేను తొక్కలేనని మా నాన్న వద్దంటాడు. సెలవొస్తేనే కడుపు నిండా
తిన్నట్లు. స్కూలుంటే ఉరకలు పరుగులతోనే జీవితం. ప్రక్కన హై స్కూల్లో చదివే నా స్నేహితుడు ఈ విషయంలో చాలా అదష్టవంతుడు. ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్ కి వెళతాడు. అదీ ఒక్క బస్సులోనే. 9.30 ఆడుతూ పాడుతూ చేరుకుంటాడు.
          నాది తినే వయసంట. మా అమ్మ చెప్తూ ఉంటది. కానీ నాకు తినడానికి సమయమే లేదు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా..నే చెప్పేది నిజమే ఉదయాన్నే ఆరు గంటలకు చద్దన్నం తిని బయలుదేరతానా, మ
ళ్ళీ అన్నం మొహం చూసేది మధ్యాహ్నం 1.10 కే, సార్లు కదా మధ్యలో మీకైతే ఆకలి వెయ్యదేమో, నాకు మాత్రం కడుపులో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నంత బాధ కలుగుతుంది. ఆకలితో ఉన్నప్పుడు మనస్సు పాఠాలమీద కంటే వంట షెడ్డులో కుతకుతలాడే అన్నం మీదే ఉంటుంది. నాకు పంచభక్ష్యపరమాన్నాలేమైనా పెడుతున్నారేమోనని భ్రమపడకండి. వండుకు తింటే కడుపు నొప్పి వస్తుందని మీరు దోసెలకు వాడతారు చూడండి ఆ బియ్యాన్ని మాకు పెడతారు. ఇక కూరల గురించి నేను వర్ణించలేను. అయినా ప్రయత్నిస్తాను. వారానికి రెండు గుడ్లు పెడతారు. ఆహా బాగుందని అప్పుడే ఒక నిర్ణయానికి రాకండి నీళ్ళ పప్పు,పప్పు లేని సాంబారు,నీళ్ళో రసమో తెలియకుండా జాగ్రత్తగా వండే రసం వండుతారు. ఏది పండితే ఆ కూరల పక్షోత్సవాలు జరుగుతాయి. 'క్షుదార్తానాం నశుచిర్నస్వాదు' అన్నట్లు ఆకలితో ఉండే వాడు రుచిని శుచిని ఎక్కడ పట్టించుకుంటాడు చెప్పండి. ఏదో కడుపులో దేవుణ్ణి శాంత పరచడానికి రెండు ముద్దలు తిందామని లైన్లో నుంచుంటానా.. ఆ మహా గుంపులో నా వంతు వచ్చే సరికి అరగంట పడుతుంది. గుడ్డు వలుచుకునే సరికి ఐదు నిముషాలు పడుతుంది. నీళ్ళ సాంబారు కలుపుకొని నాలుగు వేళ్ళు నోట్లో పెట్టుకుంటానో లేేదో ఇంతలో లోపలి బెల్లు, నా గుండే ఒకేసారి గణగణ మంటాయి. పిఇటి విజిల్స్ సహవిద్యార్థుల తొందరలు పెట్టించుకున్న ముద్దకూడా నోట్లోకి వెళ్ళనివ్వవు.
ఏంచేస్తాం నాప్రాప్తమింతేననుకొంటాను. మిగిలింది కుప్పతొట్లోకి చేరుకోగా, నేను కొలిమిలా అనిపించే క్లాసులోకి చేరతాను. పెరుగుదల వికాసాలని పెద్దలెక్చర్లిచ్చే పెద్దసార్లు మాడుతున్న నా పేగును ఎప్పుడు చూస్తారో? చూస్తే రాతి గుండె కరిగి తిండి తినడానికి కొంచెం సమయమైనా ఇస్తారేేమోనని ఎదురు చూస్తున్నాను.
ఇక ఇంటికి వెళ్ళడం మాటంటారా సూర్యుడు, పక్షులు గూటికి చేరినా నాప్రస్థానం సాగుతూనే ఉంటుంది. నిన్న మరో పిడుగు పడ్డది. సాయంత్రం 10నిముషాలు పెంచారంట. మీకు 10 నిముషలు పెద్ద సమస్య కాకపోవచ్చు. రెండు బస్సులు మారవలసిన నాకు మాత్రం అవి అమత ఘడియల్లా అనిపిస్తాయి.
ఇక నా జీవితంలో ఆటలుంటాయా ఉంటాయనుకోవటం మేకపోతు మెడచనుబాలు తాగడమేనేమో.( స్కూలు సమయాలు మార్చమని పెద్ద సార్లకు, మాస్టర్లకు నా విన్నపం)

Comments

Popular posts from this blog